: సీఎం గారూ... నా గుర్రమెక్కండి!: చంద్రబాబుకు వెలగపూడి రైతు సరదా ఆఫర్!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తొలి భవన నిర్మాణాలకు జరిగిన శంకుస్థాపనలో నిన్న ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. తమ భూముల్లో తాత్కాలిక రాజధాని ఏర్పాటు కానుందన్న సంతోషం... తుళ్లూరు మండలం వెలగపూడి రైతులను ఒక్క చోట కుదురుగా ఉండనీయ లేదు. ఇప్పటికే రాజధాని పేరిట వారి భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఉన్న భూమిలో కొంత మేర విక్రయించుకుని అప్పటిదాకా తీరని కోరికలను తీర్చుకునే పనిలో ఆ గ్రామ రైతులు పూర్తిగా నిమగ్నమయ్యారు. ఇక నిన్నటి సరదా సన్నివేశం విషయానికొస్తే... శంకుస్థాపనకు హాజరయ్యేందుకు వెలగపూడి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే సీఎం సెక్యూరిటీ నేపథ్యంలో గ్రామ రైతులను పోలీసులు అల్లంత దూరాన నిలబెట్టారు. అయితే తమ గ్రామంలో జరుగుతున్న కార్యక్రమానికి తమను అనుమతించరా? అంటూ రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడ అలజడి రేగగా, దానిని గమనించిన చంద్రబాబు... రైతులను అనుమతించాలని గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండేకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వేదిక వద్దకు వచ్చిన రైతులకు మాట్లాడే అవకాశాన్ని చంద్రబాబు కల్పించారు. ఈ క్రమంలో మాట్లాడిన వెలగపూడి రైతు కారుమంచి అప్పారావు ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. ‘‘రాజధాని ప్రకటనతో మా భూముల ధరలు పెరిగాయి. దాంతో కొంత భూమిని విక్రయించి, నా చిరకాల కోరిక అయిన గుర్రాన్ని కొనుగోలు చేశాను. రోజూ గుర్రమెక్కి రాజధాని వీధుల్లో స్వారీ చేస్తున్నాను. మీరు అవకాశం ఇస్తే, మిమ్మల్ని నా గుర్రమెక్కించి రాజధానిలో తిప్పాలని ఉంది’’ అంటూ ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వగా, చంద్రబాబు మాత్రం ఆయన ఆఫర్ కు స్పందించారు. ‘‘నువ్వు మరిన్ని గుర్రాలు కొనుగోలు చేసి అందరికీ స్వారీ చేసే అవకాశాన్ని కల్పించాలి’’ అని చంద్రబాబు చెప్పడంతో అక్కడ మరోమారు నవ్వులు విరిశాయి.

  • Loading...

More Telugu News