: రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్ల పవిత్రతను చెడగొడుతున్నారు: ఆర్.కృష్ణయ్య
రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్ల పవిత్రతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెడగొడుతున్నాయని బీసీ సంఘాల నేత, హైదరాబాదులోని ఎల్బీనగర్ శాసనసభ్యుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడునే కాదు అవసరమైతే ఆ దేవుడినైనా ఎదిరిస్తానని అన్నారు. రిజర్వేషన్లు కల్పించినా బీసీలకు సరైన న్యాయం జరగలేదని ఆయన పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం ఆగదని ఆయన తెలిపారు. రాజకీయాల కోసం రిజర్వేషన్లను వినియోగించుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.