: అరిచే ప్రతి కుక్కనూ అరెస్ట్ చేయక్కర్లేదు: చేతన్ భగత్ వ్యాఖ్యలపై దుమారం
ప్రముఖ రచయిత, సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోవర్లను కలిగివున్న చేతన్ భగత్, విద్యార్థులను కుక్కలతో పోల్చడంతో ఇప్పుడాయనపై పెను విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జవహర్ లాల్ యూనివర్శిటీలో జరిగిన ఘటనలపై తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "భారత్ కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేయడం తప్పే. అరిచే ప్రతి కుక్కనూ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు" అన్నారు. ఇక వారిపై దేశద్రోహం కేసు పెట్టడం సరికాదని, దీనివల్ల రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగవని, విద్యార్థుల అరెస్ట్ పెద్ద తప్పిదమని అభిప్రాయపడ్డారు. చేతన్ విద్యార్థులకు మద్దతుగా మాట్లాడినట్టు కనిపించినా, కుక్కలతో పోల్చడాన్ని నెటిజన్లు విమర్శిస్తున్నారు. చేతన్ కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులను కుక్కలతో పోల్చి మీ విలువను పోగొట్టుకున్నారని ఒకరు, ఇండియాలో పిచ్చి మాటలు మాట్లాడే 'మహాత్ముల' జాబితాలో మీరూ చేరడం బాధగా ఉందని ఒకరు, మీ పుస్తకాలు అమితంగా చదివే మా మిత్రుడు పిచ్చాడిలా అయిపోయాడని ఇంకొకరు వ్యాఖ్యానించారు. మోదీని రక్షించేందుకు చేతన్ భగత్ స్వయంగా వచ్చాడంటే ఎంత పెద్ద నష్టం జరిగిందో ఊహించుకోవచ్చు... ఇలా సాగుతోంది ట్వీట్ల పరంపర!