: యూఎస్ లో మంచు తుపాను, 1600 విమానాలు రద్దు!
అమెరికా తూర్పు తీరంలో గత 24 గంటలుగా బీభత్సం సృష్టిస్తున్న మంచు తుపానుతో 1600 వరకూ విమానాలు రద్దయ్యాయి. పలు టోర్నడోలు వాషింగ్టన్, న్యూయార్క్ పరిసర ప్రాంతాల్లో జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. న్యూయార్క్ సిటీ సహా ఎన్నో ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తునకు మంచు పేరుకుపోయింది. బయట తిరిగేందుకు కూడా వీలులేకుండా పోయిందని జాతీయ వాతావరణ సేవల అధికారి పాట్రిక్ బుర్కే వెల్లడించారు. మంగళవారం వరకూ ట్రావెల్ అడ్వయిజరీ హెచ్చరికలు జారీ చేసినట్టు న్యూయార్క్ సిటీ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ విభాగం తెలిపింది. సోమవారమంతా రికార్డు స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు, మంగళవారం నాడు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాషింగ్టన్, నార్త్ కరోలినా, న్యూయార్క్, మిసిసిపీ, అలబామా, ఫ్లోరిడా తదితర ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో వందలాది సర్వీసులు నిలిచిపోయాయి. వెస్సన్ ప్రాంతంలో టోర్నడోల ధాటికి పాఠశాలలు దెబ్బతిన్నాయని, ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. పెన్సిల్వేనియా, బుఫాలోలో తదితర ప్రాంతాల్లోని రోడ్లపై అరడుగు మేరకు మంచు పేరుకుపోయిందని తెలుస్తోంది.