: ఖేడ్ లో పార్టీల వ్యూహాలు మారలేదు... ప్రజలే వ్యూహం మార్చారు!


మెతుకు సీమగా ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లాలోని అన్ని ప్రాంతాల కంటే కూడా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం. గిరిజన తండాలు అధికంగా ఉన్న ఖేడ్ లో తండాలతో పాటు మెజారిటీ గ్రామాలకు కనీస రవాణా సౌకర్యాలు లేవు. ఏ అవసరం వచ్చినా, జనం కిలో మీటర్ల మేర నడిచి వెళ్లక తప్పని దుస్థితి ఇప్పటికీ నెలకొంది. ఖేడ్ లోనూ కంగ్టి మండలం అత్యంత వెనుకబడిన మండలంగా రికార్డులకెక్కింది. ఈ మండలంలో రవాణా లేమితో పాటు విద్యాలయాలు అత్యంత తక్కువ సంఖ్యలో ఉన్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి పథాన దూసుకెళుతుండగా, ఒక్క ఖేడ్ లో మాత్రం అభివృద్ధి ఇప్పటికీ పట్టాలెక్కలేదు. తెలుగు రాష్ట్రాల్లో కనీసం మార్కెట్ యార్డు కూడా లేని అసెంబ్లీ నియోజకవర్గంగా ఖేడ్ రికార్డులకెక్కింది. తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హోదాలో తన్నీరు హరీశ్ రావు పట్టుబట్టి మరీ ఖేడ్ లో ఇటీవలే మార్కెట్ యార్డును ఏర్పాటు చేయించారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు తమ పాత వ్యూహాలనే అమలు చేస్తూ వచ్చాయి. ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పటోళ్ల కిష్టారెడ్డి అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కిష్టారెడ్డిపై మూడు పర్యాయాలు పోటి చేసిన భూపాల్ రెడ్డి (ప్రస్తుత టీఆర్ఎస్ అభ్యర్థి) వరుసగా పరాజయం చవిచూశారు. అయితే ఈ పరాజయానికి కారణం లేకపోలేదన్న వాదనా వినిపిస్తోంది. భూపాల్ రెడ్డి సోదరుడు విజయపాల్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. గడచిన మూడు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా భూపాల్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు విజయపాల్ రెడ్డి పోటీ చేయడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా కిష్టారెడ్డి ఈజీగానే విజయం సాధించేశారు. సోదరుల మధ్య పోరు కిష్టారెడ్డికి కలిసి వచ్చింది. మూడు ఎన్నికల్లోనూ పరాభవం ఎదురైనా తాజాగా ఉప ఎన్నికలోనూ భూపాల్ రెడ్డి, విజయపాల్ రెడ్డిలు తమ వ్యూహం మార్చలేదు. ఇక చనిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే సభ్యుడి కుటుంబంలోని వ్యక్తికే సీటిచ్చిన కాంగ్రెస్ కూడా తన వ్యూహమేమీ మార్చలేదు. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ వల్లిస్తున్న అభివృద్ధి మంత్రాన్ని పరిశీలించిన ప్రజలు తమ వ్యూహం మార్చి ఈ దఫా టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డికి ఓటేశారు. ఫలితంగా కిష్టారెడ్డి చేతిలో మూడు పర్యాయాలు ఓటమి చవిచూసిన భూపాల్ రెడ్డి... ఉప ఎన్నికలో కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని చిత్తు చేశారు. ఖేడ్ చరిత్రలో తొలిసారిగా అక్కడ గులాబీ జెండాను రెపరెపలాడించారు.

  • Loading...

More Telugu News