: రూ. 500లోపే స్మార్ట్ ఫోన్ 'ఫ్రీడమ్ 251', రేపు విడుదల చేయనున్న రక్షణమంత్రి
ఇండియాలో అత్యంత చౌక ధరలో స్మార్ట్ ఫోన్ రేపు మార్కెట్లోకి రానుంది. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న దేశవాళీ మొబైల్ ఫోన్ల సంస్థ రింగింగ్ బెల్స్ దీన్ని తయారు చేసింది. 'ఫ్రీడమ్ 251' పేరిట తయారైన ఈ ఫోన్ ధర రూ. 500కన్నా తక్కువేనట. దీన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా విడుదల చేయించనున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ మేరకు మీడియాకు ఆహ్వానం అందింది. కాగా, ప్రస్తుతం ఇండియాలో రూ. 1,500 ధరలో స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. వీటిని డేటావిండ్ అందిస్తుండగా, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యానికేషన్స్ రూ. 999 ధరలో స్మార్ట్ ఫోన్ ను త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది. ఇటీవల రూ. 2,999 ధరలో ఇండియాలో అతి తక్కువ ధరకు 4జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన రింగింగ్ బెల్స్ ఈ కొత్త ఫోన్లకు మంచి ఆదరణ ఉంటుందని అంచనా వేస్తోంది.