: ఇకపై జేఎన్ యూ విద్యార్థులకు ఉద్యోగాలివ్వమన్న రతన్ టాటా... పుకార్లేనంటూ ‘టాటా సన్స్’ ప్రకటన
టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. విజయవంతమైన పారిశ్రామికవేత్తగా సుదీర్ఘ కాల ప్రస్థానంలో రతన్ టాటా వివాదాల్లో చిక్కుకోవడం మొన్నటిదాకా జరగనేలేదు. ఆమధ్య కార్పొరేట్ లాబీయింగ్ కేసులో నీరా రాడియాతో రతన్ టాటా మాట్లాడినట్లు విడుదలైన ఆడియో టేపులు పెను దుమారాన్నే రేపాయి. అయితే ఆ వివాదం ఎంత త్వరగా వచ్చిందో అంతే త్వరగా మాయమైంది. తాజాగా ఢిల్లీలోని జేఎన్ యూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వేదికగా నిలిచిందన్న వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సంబంధించి రతన్ టాటా మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయమైన జేఎన్ యూకు చెందిన విద్యార్థులను ఇకపై తమ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేయబోమని రతన్ టాటా వ్యాఖ్యానించారన్న వివాదం చెలరేగింది. ప్రస్తుతం ముంబై వేదికగా జరుగుతున్న మేకిన్ ఇండియా వీక్ సందర్భంగా రతన్ టాటా ఈ మేరకు వ్యాఖ్యానించారన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. అయితే వేగంగా స్పందించిన టాటా సన్స్ ఈ వ్యాఖ్యలను ఖండించింది. రతన్ టాటా ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదని ఆ సంస్థ అధికారికంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.