: లగడపాటి రీ ఎంట్రీ!... బీజేపీలో చేరుతున్నట్లు బెజవాడలో ఫ్లెక్సీలు!
లగడపాటి రాజగోపాల్... గుర్తున్నారుగా? విజయవాడ ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ నేతగా ఆయన ఏం చేసినా సంచలనమే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సమీపంలో తెలంగాణవాదులు ఆయనపై చేయి చేసుకున్నారు కూడా. ఇక రాష్ట్ర పునర్విభజన బిల్లు సందర్భంగా పార్లమెంటు హాలులోకి పెప్పర్ స్ప్రేను పట్టుకెళ్లి దేశవ్యాప్తంగా సంచలనం రేపారు. అంతకుముందు సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడలో నిరాహారదీక్షకు దిగిన రాజగోపాల్ ను పోలీసులు అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా, పోలీసులకు మస్కా కొట్టి అక్కడి నుంచి మాయమై, వివిధ మార్గాలలో పయనించి, ట్రాక్ సూట్ లోనే సరాసరి హైదరాబాదుకి వచ్చి, నిమ్స్ లో చేరి, పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. లాంకో గ్రూపు అధినేతగా పారిశ్రామికరంగంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా పేరొందిన ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెప్పేయడమే కాక ఏకంగా రాజకీయాలకే వీడ్కోలు పలికారు. వెరసి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో కనిపించలేదు. ఇదంతా జరిగి దాదాపు రెండేళ్లవుతోంది. అయితే రాజకీయాలకు దూరంగా లగడపాటి ఉండలేకపోయారు. మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. ఈ మేరకు నిన్న విజయవాడలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. లగడపాటి రాజకీయాల్లోకి రావాలని కాంక్షిస్తున్నట్లు ఆయన సన్నిహితుల పేరిట వెలసిన సదరు ఫ్లెక్సీల్లో బీజేపీ నేతల ఫొటోలతో పాటు కొన్ని చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోలు కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో లగడపాటి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. దీనిపై ఎప్పటిలోగా స్పష్టత వస్తుందో చూడాలి.