: తుని ఘటన కేసులు సీఐడీకి అప్పగించాం: చినరాజప్ప
తుని ఘటన కేసులను సీఐడీకి అప్పగించామని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన వారిని విడిచిపెట్టమని, ఈ ఘటనతో సంబంధమున్న వారు అధికార పక్షానికి లేదా ప్రతిపక్షానికి చెందిన వారైనా కేసులు నమోదు చేస్తామని అన్నారు. శాంతిభద్రతలను కాపాడటమే తమ లక్ష్యమని.. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చినరాజప్ప స్పష్టం చేశారు. కాగా, కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఇటీవల తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సదస్సు హింసాత్మకంగా మారింది. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు కాపు కులస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముద్రగడ పిలుపు మేరకు రైల్ రోకో, రాస్తారోకోలకు దిగడం.. అవి హింసాత్మకంగా మారడం తెలిసిందే.