: స్టార్ హోటల్ సదుపాయాలతో స్మార్ట్ రైలు బోగీలు, ప్రత్యేకతలివే!
రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేసేందుకు 'స్మార్ట్ కోచ్'లు రానున్నాయి. మరో రెండు వారాల్లో పార్లమెంట్ ముందుకు రానున్న రైల్వే బడ్జెట్ లో ఈ స్మార్ట్ రైలు బోగీల గురించిన మరింత సమాచారం వెలువడుతుందని తెలుస్తోంది. రైల్వే శాఖ అధికారుల ప్రకారం, ఈ బోగీలు అత్యంత ఆధునికంగా ఉంటాయి. జీపీఎస్ ఆధారిత అలారం, ఎల్ఈడీ కాంతుల్లో వెలిగిపోయే రిజర్వేషన్ చార్టులు, వైఫై సౌకర్యం, విమానాల్లో మాదిరిగా, టీటీ (ట్రెయిన్ కండక్టర్) నుంచి ఆడియో ప్రకటనలు తదితర సౌకర్యాలు ఉంటాయి. రైల్లోనే మంచినీరు, కాఫీ, కూల్ డ్రింక్స్ అమ్మే వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి బెర్తుకు ల్యాప్ టాప్ చార్జింగ్ పాయింట్లు, ఆటోమేటిక్ డోర్లు, మైక్రోప్రాసెసర్ ఆధారిత ఏసీ యూనిట్లు, సెన్సారింగ్ వ్యవస్థ ఆధారంగా పనిచేసే మాడ్యులర్ టాయ్ లెట్లు, ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్లు, హ్యాండ్ డ్రయ్యర్లు తదితర సౌకర్యాలుంటాయి. ఆటోమేటిక్ ఫైర్ అండ్ స్మోక్ డిటెక్షన్ వ్యవస్థలతో పాటు సీసీటీవీ కెమెరాల ఏర్పాటూ ఉంటుంది.