: జేఎన్ యూలో ఇలాంటి బహిరంగ చర్చలు సాధారణం: స్టూడెంట్ యూనియన్ లీడర్ బాలాజీ
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చర్చలు, సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణమని స్టూడెంట్ యూనియన్ లీడర్ బాలాజీ తెలిపారు. ఢిల్లీ, జేఎన్ యూలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరించి భావి భారత మేధావులుగా ఎదగాల్సిన విద్యార్థులు చర్చలు జరుపుతారని, ఆ సందర్భంగా ర్యాలీలు, నిరసన వ్యక్తం చేయడం సర్వసాధారణమని అన్నారు. ఇప్పుడు వివాదంగా చెప్పబడుతున్నది కూడా అలాంటి ఆందోళనేనని ఆయన తెలిపారు. అయితే చివర్లో కొందరు అప్జల్ గురుకు అనుకూల నినాదాలు చేశారని, వాటిని విద్యార్థి సంఘాలన్నీ ఖండించాయని ఆయన చెప్పారు. అయితే వివాదం మొత్తం ఎక్కడ మొదలైందంటే, జేఎన్ యూ విద్యార్థుల హక్కులు కాలరాయడం దగ్గరే మొదలైందని ఆయన చెప్పారు. ఇప్పుడు విలువలు కలిగిన నేతలంతా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ల నుంచి వచ్చిన వారేనని, భవిష్యత్ లో అలా జరగకూడదని బీజేపీ కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. అది ఆర్ఎస్ఎస్ భావజాలమని, అందుకే స్టూడెంట్స్ ను దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందని ఆయన చెప్పారు. యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థులను అణచివేయడమే ప్రభుత్వ విధానంగా మారిందని, అఫ్జల్ గురు గురించి తాము ఆందోళన చేయలేదని, ఉరికి వ్యతిరేకంగా తాము ఆందోళన చేశామని ఆయన స్పష్టం చేశారు.