: కాంగ్రెస్ కు షాక్!... లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించలేమన్న సుప్రీంకోర్టు
మూలిగే నక్కపై తాటికాయ పడింది. నిజమే... కాంగ్రెస్ కు ఈ వార్త పెద్ద షాకే. లోక్ సభలో అధికార పార్టీ తర్వాత అత్యధిక సంఖ్యా బలం ఉన్న తమకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కల్పించాలన్న ఆ పార్టీ పిటిషన్ ను కొద్దిసేపటి క్రితం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో 44 సీట్లలో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనకు స్వస్తి పలికి ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాల్సి వచ్చింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 44 సీట్లలో మాత్రమే గెలిచిన ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాలో కూడా కూర్చోలేని పరిస్థితి. ఇదే విషయాన్ని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తో పాటు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కూడా కాంగ్రెస్ కు తేల్చిచెప్పారు. అయినా, వినకుండా ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టు గడప తొక్కింది. వాస్తవ పరిస్థితులు, గతంలో లోక్ సభ స్థితిగతులను పరిశీలించిన సుప్రీంకోర్టు కూడా ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష స్థానంలో కూర్చునేందుకు అర్హత లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.