: 'అమర వీరత్వం'పైనా వివక్షా? 'ap7am' పాఠకుడి అక్షరావేదన!
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపుకాస్తూ, మంచుచరియలు విరిగిపడి మరణించిన పది మంది సైనికులూ అమరులే. అయితే, ఆరు రోజుల పాటు ప్రాణాలు నిలుపుకుని మరో మూడు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన హనుమంతప్పకు వచ్చినంత పేరు మిగతా 9 మందికీ రాలేదు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ, (హనుమంతప్ప త్యాగాన్ని కించపరచకుండానే) 'ap7am' పాఠకుడు మునిసురేష్ పిళ్లై తన మనసులోని బాధను, ఆవేదనను అక్షర రూపంలో ఇలా పంచుకున్నారు. ప్రియమైన ముస్తాక్... నాలో చెలరేగుతున్న సంకుచితత్వానికి నా మీద నాకే ఛీత్కారం! 'నా జాతి అంతా ఒక్కటే' అనే కారు కూతలు కూస్తూనే నీ అంతరంగం కూడా అంతే.. అనే పూర్తి స్పృహ ఉన్నా నిన్ను మాత్రం 'నా' అంటున్నందుకు నన్ను చీదరించుకోకు ముస్తాక్! ఇది నీ మీద నాకున్న ప్రత్యేకమైన ప్రేమ కాదు వృత్తిగతమైన నా జాతి మీద బాధాతప్త కడుపుమంట! అజ్ఞానం, ఒత్తిడీ, ఆలోచన లేని తెలివిడీ కలిసి దారీతెన్నూ కానలేని కన్నులనే నా జాతికి ప్రసాదించాయి! యుద్ధం.. చంపడానికి సిద్ధమై వెళ్లే రణభూమి... కొండొకచో బలికావడం తప్పకపోవచ్చు గాక! సియాచిన్.. చావడానికి సిద్ధమై వెళ్లే మరుభూమి... అక్కడ మరణించడం కాదు మిత్రమా... అడుగుపెట్టడమే ఒక త్యాగచిహ్నం. మంచు.. మంచితనం లాంటిదే మరీ ఎక్కువైపోతే భరించలేక చచ్చిపోతాం! ఒక విధ్వంసక హిమశిఖరం అవలాంచీగా విరుచుకుపడి నా తల్లి సిగలో మల్లెల దాపున మాటువేసి ఉన్న మీపై వేటు వేసిందే! ఒక వేయి కన్నులు ఉండి ఉంటే అన్నీ చెలమలుగా మారి ఉంటే ఉబికి వచ్చే నీళ్లూ.. మీ కాళ్లు కడగడానికి చాలవుగా ముస్తాక్! మీ పది ప్రాణాల ఆకలి దానిది నిన్ను ముందే కబళించేసింది ఎందుకు! ఏలుమలై గణేశన్ నగేశ్ సురేశ్ సుధీశూ సూర్యవంశీ కుమారూ రామ్మూర్తీ అందరూ నా తల్లి బిడ్డలే! అందరికోసమూ ఒకే తీరుగా ఏడవాల్సిందే. కానీ ఏం చేయను ముస్తాక్. నా ఇంట్లో శవం లేవడానికీ పొరుగింట్లో మరొకడు చావడానికీ తేడా చూపించకుండా ఉండగల స్థితప్రజ్ఞత లేని సామాన్య మానవుణ్ని. అందుకే నా జాతి గొర్రెదాటు తీరుపై కడుపు మంట పెంచుకుంటున్నా. హిమసమాధి అడుగు పొరలో హనుమంతప్ప అర ఊపిరి మెరిసినప్పుడు నాలోనూ ఆశ విరిసింది. ఒక వీరజవాను.. ఆస్పత్రి మంచం మీద పోరాటంలో అసువులు బాసినప్పుడు... నా కనులూ చెమర్చాయి. తడి అయిన కోట్ల గుండెలలో నాదొకటి అయి ఉండొచ్చు. అశక్తుడిని, నీకోసం కూడా అంతే చేయగలను ముస్తాక్! కానీ నా జాతికి ఏమైంది! హనుమంతప్ప ఒక్కడూ బ్యానర్ వార్త ఎందుకయ్యాడో ముస్తాక్ సింగిల్ కాలంలో ఎందుకు కుదింపబడ్డాడో నా బుద్ధికి ఎరుపడట్లేదంటే నమ్ము. హనుమంతప్ప త్యాగాన్ని కించపరిచేంత అధముణ్ని కాను. ఆరురోజులు ఆగలేకపోయినందుకు మీ ప్రాణాలు అంత పలచనైపోయాయా? పర్నపల్లెలో నీ కళేబరాన్ని 'దఫన్' చేస్తుండగా.. ఆకసానికేసి మోగే తుపాకుల సాక్షిగా నీ శవం రాక 'బ్యానర్' కాలేకపోయినందుకు సిగ్గుపడుతున్నా ముస్తాక్! శ్రీమతి మహాదేవి కళ్లలో కారినవి బాధాతప్త రక్తాశ్రువులు ఎందుకవుతాయో... 'అహదియా' ముస్తాక్ కళ్లలోంచి ఉప్పటి మామూలు కన్నీళ్లు ఎందుకు కారుతాయో... ఈ రెండు కన్నీళ్లను వేరు చేసిచూడగల నా జాతి ఉద్ధతికి మమ్ము మన్నించు ముస్తాక్. హనుమంతప్పా, నువ్వూ ఒకే చోటకు చేరుతారు. మీలో మీకు వ్యత్యాసాలుండవు! మేం చూపించిన తేడాలు గమనించి మీకు చికాకు కలగవచ్చు. విలువ కట్టడానికి సరిపోయే తూకం రాళ్లు మా బుర్రల్లో లేవు! ఎక్కడో ఇంగ్లిషు, హిందీల్లో బుర్రలేని ఒక గొర్రె అదాటున దాటితే.. మాకందరికీ అదే రహదారి! పైన, మీ పదిమందీ కలిసి కబుర్లు పంచుకునే వేళ మా అజ్ఞానపు ప్రస్తావన వస్తే... ఈసడించుకోవద్దు ముస్తాక్.. వీసమెత్తు జాలి చూపించగలిగితే చాలు. -కె.ఎ. మునిసురేష్ పిళ్లై