: దీప్తి సర్నా కిడ్నాపర్ల అరెస్ట్... నిందితుల్లో సర్నా కుటుంబ ‘సైకో’ సన్నిహితుడు
స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా కిడ్నాపర్లు ఎట్టకేలకు ఘజియాబాదు పోలీసులకు చిక్కారు. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో దీప్తిని ఈ నెల 10న గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లారు. దీనిపై దీప్తి స్నేహితుడు వేగంగా స్పందించడం, ఆమె తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవేయడం, వెనువెంటనే పోలీసులకు ఫిర్యాదు, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నేపథ్యంలో 36 గంటల తర్వాత, ఎలాంటి అపాయం తలపెట్టకుండానే కిడ్నాపర్లు ఆమెను విడిచిపెట్టారు. విడుదల సందర్భంగా కిడ్నాపర్లు దీప్తి ఇంటికి చేరేందుకు అవసరమైన డబ్బు కూడా ఇచ్చి పంపారు. ఇంటికి చేరుకున్న దీప్తి వద్ద వివరాలు సేకరించిన పోలీసులు... సర్నా కుటుంబానికి సన్నిహితంగా ఉన్న దేవేంద్ర అనే సైకోనే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఈ క్రమంలో నిందితుల కోసం వేట సాగించిన పోలీసులు దేవేంద్రతో పాటు అతడికి సహకరించిన మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సైకో మనస్తత్వమున్న దేవేంద్రపై ఇప్పటికే హిస్టరీ షీట్ నమోదైంది. నేడు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.