: రెచ్చిపోయిన ‘ఎర్ర’ స్మగ్లర్లు... పోలీసులపై రాళ్ల దాడి, ప్రతిగా గాల్లోకి ఖాకీల కాల్పులు
తిరుమల వెంకన్న పాదాల చెంత తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. నగర శివారు ప్రాంతం ఎస్వీ నగర్ సమీపంలో పోలీసులపై రాళ్ల దాడితో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆర్ఎస్ఐ వాసుకు గాయాలయ్యాయి. ప్రతిగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్ల దాడులు, పోలీసుల ప్రతిదాడులతో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరుపతి నగరం హడలెత్తిపోయింది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులను గమనించిన ఎర్రచందనం కూలీలు తప్పించుకునే క్రమంలో రాళ్లతో విరుచుకుపడ్డారు. రాళ్ల దాడి నుంచి తప్పించుకునే క్రమంలోనే ఆర్ఎస్ఐ వాసుకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఇక లాభం లేదనుకున్న పోలీసులు స్మగ్లర్లపై కాల్పులు ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసుల వైపు నుంచి కాల్పుల శబ్దం వినపడటంతో స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే కాస్తంత వేగంగా స్పందించిన పోలీసులు ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టారు.