: నా రచనల్లో మధ్యతరగతి మహిళే హీరోయిన్!: రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి
మధ్యతరగతి మహిళే తన రచనల్లో హీరోయిన్ అని ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి అన్నారు. యద్దనపూడి రచించిన సెక్రటరీ నవలకు యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమెను ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చాలా పెద్ద కుటుంబం నుంచి తాను వచ్చానని, అదే పెద్ద సంఘమని, వాళ్లను అర్థం చేసుకుంటే చాలని, ఆ విధంగానే తనకు పరిశీలనా శక్తి అలవడిందని చెప్పారు. అటువంటి వ్యక్తిత్వాలున్న వారే మనకు బయట కూడా కనపడుతుంటారని అన్నారు. కాలేజీల్లోను, విశ్వవిద్యాలయాల్లోను తానేమీ చదవలేదని, కేవలం హైస్కూల్ విద్యకే తాను పరిమితమయ్యానని చెప్పారు. సాటిమనిషిని అర్థం చేసుకోవాలని, అయితే పక్కమనిషిని అర్థం చేసుకునే పరిస్థితి కాని, పలకరించే పరిస్థితి కాని ఇప్పుడు లేవని అన్నారు. తన రచనలన్నింటిలో మధ్యతరగతి మహిళ కథే ఉంటుందని, తనే హీరోయిన్ అని, తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తానో.. మధ్యతరగతి కుటుంబాన్ని కూడా అంతగా తాను ప్రేమిస్తానని యద్దనపూడి సులోచనారాణి అన్నారు.