: జేఎన్ యూ అల్లర్ల వెనుక పాక్ ఉగ్రవాది హస్తం: రాజ్ నాథ్ సింగ్
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్ యూ)లో ఆందోళనల వెనుక పాకిస్తాన్ ఉగ్రవాది హస్తం ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా తేలి, ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురుకు అనుకూలంగా జేఎన్ యూ లో ఒక ప్రత్యేక దినం నిర్వహించిన వ్యవహారం రోజురోజుకు ముదురుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. భారత జాతికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాకిస్థాన్ ఉగ్రవాది, లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం ఉందన్నారు. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అంశంపై మాట్లాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఈ విషయమై అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. జేఎన్ యూ సంఘటనలో అసలు దోషులను కఠినంగా శిక్షిస్తామని రాజ్ నాథ్ పేర్కొన్నారు.