: చైనాను నిలువరించేందుకే... మాలేలో మోహరించిన విక్రమాదిత్య, మైసూర్, దీపక్
హిందూ మహా సముద్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న చైనా కార్యకలాపాలను నిలువరించేందుకు భారత్ కదిలింది. ఇప్పటికే శ్రీలంకలో యుద్ధ నౌకలను మోహరించిన భారత్, ఇప్పుడు మాల్దీవుల వైపు కదిలింది. 44,500 టన్నుల బరువైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య సహా, డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మైసూర్, ట్యాంకర్ ఐఎన్ఎస్ దీపక్ లను మాలేకు పంపింది. జనవరి 21 నుంచి రెండు రోజుల పాటు తొలిసారిగా కొలంబో నౌకాశ్రయంలో మకాం వేసిన విక్రమాదిత్య, రేపటి నుంచి మూడు రోజుల పాటు మాలేలో ఉంటుందని, దానితో పాటు మిగిలిన చిన్న యుద్ధ నౌకలు తోడుంటాయని ఓ అధికారి తెలిపారు. సముద్రంలో శక్తికి నిదర్శనంగా పేరున్న విక్రమాదిత్య నవంబర్ 2013 నుంచి సేవలందిస్తోంది. 22 అంతస్తులుండే 60 మీటర్ల లోతు, 284 మీటర్ల పొడవైన ఈ నౌక 30 నాటికల్ మైళ్ల వేగంతో ఆగకుండా 7 వేల నాటికల్ మైళ్ల దూరం వెళుతుంది. 24 మిగ్ 29కే సూపర్ సోనిక్ ఫైటర్లతో పాటు ధృవ్, చేతక్ రకాలకు చెందిన 10 హెలికాప్టర్లు ఉంటాయి. 110 మంది అధికారులు, 1500 మంది నావికులు ఉంటారు. ఈ తరహా అత్యాధునిక యుద్ధ వాహక నౌకలు, ఇండియా, ఇటలీల వద్ద రెండు చొప్పున ఉండగా, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రెజిల్ వద్ద ఒక్కోటి ఉన్నాయి. భవిష్యత్ అవసరాలంటూ, పాకిస్థాన్ లోని గ్వదార్ పోర్టుతో పాటు లంకలోని హంబనోతా నౌకాశ్రయంతో చైనా సంబంధాలను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ సైతం అదే దారిలో నడుస్తోంది.