: తిరుమలలో రథసప్తమి వేడుకలు ... సామాన్య భక్తుల ఇక్కట్లు!
దేవదేవుడు ఒకే రోజు సప్త వాహనాలపై సంచరించి భక్తులను కరుణించే పవిత్ర రథసప్తమి నాడు, టీటీడీ అధికారులు వీఐపీలకు పెద్దపీట వేస్తూ, సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు గత రాత్రికే భక్తులతో నిండిపోగా, వెలుపల ఉన్నవారు తమను లోనికి వదలడం లేదని ఈ ఉదయం నిరసనకు దిగారు. కంపార్టుమెంట్లు ఖాళీలేవని అధికారులు చెబుతుండటం, సామాన్య భక్తులకు ఇంకా దర్శనం ప్రారంభం కాకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు వీఐపీల సేవలో తరిస్తున్నారని ఆరోపించారు. కాగా, శ్రీవారికి సూర్యప్రభ వాహన సేవ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఆపై ఉదయం 8:30 గంటలకు సింహ వాహనం, 10 గంటలకు అశ్వ వాహనం, 11:30 గంటలకు గరుడ వాహన సేవలు జరగనున్నాయి. ఆపై మధ్యాహ్నం 3 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6:15 గంటలకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8:30కి గజవాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.