: విశాఖ మ్యాచ్ కు సర్వం సిద్ధం...ఫేవరేట్ ధోనీ సేన


విశాఖపట్టణంలోని రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ లో క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. చివరి మ్యాచ్ లో సత్తా చాటేందుకు రెండు జట్లు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి. విశాఖ స్టేడియంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. ఈ పిచ్ పై అంతర్జాతీయ మ్యాచ్ లంటే టీమిండియా ఆటగాళ్లు రికార్డుల మోత మోగించేందుకు ఉవ్విళ్లూరుతారు. టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలో దిగుతున్నప్పటికీ, శ్రీలంక యువ ఆటగాళ్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తొలి టీట్వంటీలో బౌలర్లు, బ్యాట్స్ మన్ రాణించి సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే, రెండో వన్డేలో ఫీల్డింగ్ వైఫల్యాలు ఆ జట్టు కొంపముంచాయి. ఇక టీమిండియా టాప్ ఆర్డర్ రాణిస్తే ఎలాంటి జట్టయినా చిత్తుకావాల్సిందే. అయితే టాప్ ఆర్డర్ ను పెవిలియన్ బాటపట్టించగలిగితే టీమిండియా పని అయిపోయినట్టేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మిడిల్ ఆర్డర్, టెయిలెండర్లు ఇప్పటి వరకు రాణించిన సందర్భాలు లేవు. దీంతో టీమిండియా టాప్ ఆర్డర్ ను కూల్చగలిగితే సగం విజయం సాధించినట్టేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, తొలి టీట్వంటీలా లంకేయులు రాణిస్తారా? రెండో టీట్వంటీలా టీమిండియా చెలరేగుతుందా? అనే ఆసక్తి నెలకొంది. ఎవరు గెలిస్తే వారిదే టైటిల్ అయిన నేపథ్యంలో రెండు జట్లు శక్తిమేరకు ఆడతాయని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News