: రికార్డు సంగతి దేవుడెరుగు...హ్యాట్రిక్ అన్న సంగతి కూడా తెలీదు: పెరీరా


రాంచీ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీట్వంటీలో రికార్డు నమోదైన సంగతి తనకు తెలియదని శ్రీలంక బౌలర్ తిషార పెరీరా తెలిపాడు. అసలు హ్యాట్రిక్ కొట్టిన సంగతి కూడా తనకు తెలియదని అన్నాడు. యువరాజ్ సింగ్ వికెట్ దక్కిందన్న ఆనందమే తప్ప, అది హ్యాట్రిక్ ఆనందం కాదని అన్నాడు. శిఖర్ ధావన్ విరుచుకుపడడంతో ఆదిలోనే పరుగులు ధారాళంగా సమర్పించుకున్నామని చెప్పిన పెరీరా, పరుగుల కట్టడి, వికెట్లు తీయడంపైనే ప్రధానంగా దృష్టి సారించానని వెల్లడించాడు. దీంతో 19వ ఓవర్ లో భారీ షాట్లకు ప్రయత్నిస్తున్న హార్డిక్ పాండ్యను అవుట్ చేయగానే కాస్త సంతోషంగా అనిపించిందని, తరువాత రైనాను అవుట్ చేయడంతో ఆ ఓవర్ లో పరుగులు తగ్గాయనుకున్నానని అన్నాడు. అయితే యువరాజ్ సింగ్ కూడా అవుట్ కావడంతో ఓవర్ బాగా వేశానని భావించానని అన్నాడు. అయితే ఆ తరువాతే తాను హ్యాట్రిక్ సాధించానని అర్థమైందని, అది కూడా మైదానం వీడిన తరువాత తెలిసిందని పెరీరా తెలిపాడు. మ్యాచ్ లో ధావన్ విరుచుకుపడితే, అశ్విన్ తమను చాలా ఇబ్బంది పెట్టాడని పెరీరా పేర్కొన్నాడు. కాగా, టీట్వంటీల్లో హ్యాట్రిక్ సాధించిన నాలుగవ బౌలర్ గా పెరీరా రికార్డులకెక్కాడు. కాగా, పెరీరా కెరీర్ లో ఇది రెండవ హ్యాట్రిక్. గతంలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో తొలి హ్యాట్రిక్ సాధించినట్టు తెలిపాడు.

  • Loading...

More Telugu News