: పేట్రేగిన ఉగ్రవాదులు... కాశ్మీర్ లో ఇద్దరు సైనికుల మృతి
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. నేటి ఉదయం కుప్వారా పరిధిలోని నియంత్రణ రేఖ వద్ద దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను సైన్యం అడ్డుకుంది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు చనిపోయారు. అక్కడ ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను అడ్డుకుంటున్న క్రమంలో పలువురు సైనికులు మృత్యువాత పడుతున్నారు. తాజా ఘటనతో కుప్వారా పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.