: ఏలూరు జైల్లో అగ్రిగోల్డ్ చైర్మన్, ఎండీ... బెయిల్, కస్టడీ పిటీషన్లపై సోమవారం విచారణ
తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్ణాటకల్లో దాదాపు 40 లక్షల మధ్య తరగతి కుటుంబాలను నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వా వెంకట శేషు నారాయణరావులను ఏపీ సీఐడీ పోలీసులు ఎట్టకేలకు మొన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అరెస్ట్ చేశారు. నిన్న ఏలూరులోని పశ్చిమగోదావరి జిల్లా కోర్టు వారిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో వారిద్దరినీ పోలీసులు ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే, అరెస్టైన మరుక్షణమే నిందితులిద్దరూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు లక్షలాది మంది బాధితుల ప్రయోజనాలు ముడిపడి ఉన్న ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులిద్దరినీ తమ కస్టడీకి అప్పగించాలని కూడా సీఐడీ కోర్టును కోరింది. నిందితుల బెయిల్ పిటిషన్ తో పాటు పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.