: ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థి నేత అరెస్టు... అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ఆందోళనే కారణం
పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురును ఉరితీయడంపై ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థులు వ్యతిరేక ర్యాలీలు, ఆందోళన నిర్వహించడంపై కేంద్రం సీరియస్ అయింది. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదేశాల మేరకు జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయా కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ నెల 9న జేఎన్ యూలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేశారన్న వార్త బయటికి వచ్చింది. అంతేగాక వర్సిటీ మాజీ ప్రొఫెసర్ ఒకరు అఫ్జల్ ను ప్రశంసిస్తూ నినాదాలు కూడా చేశారని తెలిసింది. ఈ మొత్తం వ్యవహారం కాస్తా బయటికి రావడం, పలువురు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా చర్యలకు ఉపక్రమించింది.