: పంటపొలాలను నాశనం చేసే నెమళ్లను చంపివేయండి: గోవా ప్రభుత్వం
పంటపొలాలను నాశనం చేసే నెమళ్లను చంపివేయాలంటూ గోవా ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. పంట పొలాలను నాశనం చేసే జాబితాలో జాతీయపక్షి నెమలిని కూడా చేర్చుతున్నట్లు గోవా వ్యవసాయశాఖ మంత్రి రమేశ్ తవాడ్కర్ పేర్కొన్నారు. కోతులు, అడవి పందులలాగే నెమళ్లు కూడా పంట పొలాలను నాశనం చేస్తున్నాయని, రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రైతులతో సమావేశమైన గోవా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తవాడ్కర్ చెప్పారు. కాగా, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ 1లో నెమళ్లను రక్షించాలని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా గోవా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి.