: సోనియా, రాహుల్ లకు ఊరట... ‘హెరాల్డ్’ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఎట్టకేలకు కాస్తంత ఊరట లభించింది. ఈ కేసు విచారణకు వారిద్దరూ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు సోనియా, రాహుల్ గాంధీలు దాఖలు చేసుకున్న పిటిషన్ పై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా సోనియా, రాహుల్ తొలిసారిగా కోర్టు మెట్లెక్కారు. తదుపరి విచారణకు కూడా హాజరుకావాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతో వారిద్దరూ ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై సమగ్ర విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వ్యక్తిగత హాజరు నుంచి వారిద్దరికి మినహాయింపునిచ్చింది.