: లక్షల్లో వసూలు చేసి బోర్డు తిప్పేసిన మరో టెక్ సంస్థ!
టెక్నాలజీ రంగంలో నిరుద్యోగులకు ఉండే ఆసక్తిని మరో సంస్థ సొమ్ము చేసుకుంది. ఉద్యోగాలిస్తామని మాయమాటలు చెప్పి లక్షలకు లక్షలు వెనకేసుకుని బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు బోరుమనాల్సిన పరిస్థితి. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్ సమీపంలో మూడు నెలల క్రితం ఇమినేట్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ సంస్థ ప్రారంభమైంది. దీనికి మేనేజింగ్ డైరెక్టరుగా రాజ్ కుమార్ వ్యవహరిస్తున్నాడు. నాగరాజు, ప్రదీప్, ఖాజా, సంతోష్, శ్రీధర్ లు ప్రధాన ఉద్యోగులు. వీరంతా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి మంచి వేతనాలు ఇస్తామని నమ్మబలికారు. సంస్థను నమ్మిన 60 మందికి పైగా యువతీ యువకులు రూ. లక్ష చొప్పున చెల్లించారు. తర్వాత ఒక్క నెల రోజులు మాత్రం కంపెనీ బాగానే నడిచింది. నిరుద్యోగులకు ఇస్తామన్న వేతనాలు సైతం చెల్లించారు. ఆ తర్వాత నుంచి సమస్యలు మొదలయ్యాయి. నిధుల లేమి పేరిట జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులకు అనుమానం వచ్చింది. వారు నిలదీస్తుండగానే, ఓ ముహూర్తం చూసుకుని కార్యాలయం బోర్డు నుంచి ఫర్నీచర్ వరకూ అన్నింటినీ నిర్వాహకులు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో తాము మోసపోయామని భావించిన బాధితులు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.