: కోర్టులోనే లంచావతారం... అరెస్ట్ చేసిన టీ ఏసీబీ
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తూ సర్కారీ వేతనం తీసుకుంటూ కూడా చేతివాటం ప్రదర్శించే లంచావతారాలు కోర్టుల్లో చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. అలాంటిది సాక్షాత్తు కోర్టులోనే ఓ లంచావతారం చేతివాటం ప్రదర్శించాడు. కోర్టులోనే పనిచేసే సదరు ఉద్యోగిని తెలంగాణ ఏసీబీ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు. ఈ మేరకు సంచలనం సృష్టించిన ఈ ఘటన నిన్న తెలంగాణలోని మెదక్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... మెదక్ లోని మూడో అదనపు జిల్లా కోర్టులో 2009 నుంచి ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో హైదరాబాదుకు చెందిన లాల్ సింగ్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కేసులో తన ప్రత్యర్థులకు సమన్లు జారీ చేయించేందుకు ఆయన నానా పాట్లు పడ్డారు. ఈ క్రమంలో రూ.5 వేలిస్తేనే సమన్లు జారీ చేస్తానంటూ కోర్టులో బెంచ్ క్లర్కుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి వెంకటరమణారెడ్డి... లాల్ సింగ్ కు తేల్చిచెప్పాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన లాల్ సింగ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల పక్కా ప్లాన్ ప్రకారం.. నిన్న లాల్ సింగ్ రూ.5 వేలను వెంకటరమణారెడ్డికి అందజేశారు. ఈ సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు సదరు ఉద్యోగిని అరెస్ట్ చేశారు.