: నా మేనల్లుడు బుల్లెట్!... హరీశ్ పై కేసీఆర్ ప్రశంసలు
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... తన మేనల్లుడు, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో దూరం పెరుగుతోందన్న వదంతులను తిప్పికొట్టారు. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా హరీశ్ రావును నిన్న ఆయన ఆకాశానికెత్తేశారు. బుల్లెట్ లా పనిచేసే మంత్రిగానే కాక యువకుడిగా, శక్తి ఉన్నోడిగా కూడా ఆయన హరీశ్ రావును అభివర్ణించారు. ‘‘బ్రహ్మాండమైన మంత్రి మీ జిల్లాలో ఉన్నడు. అద్భుతంగా బుల్లెట్ లా దూసుకుపోయే తత్వమున్న మనిషి హరీశ్. ఆయన మిమ్మల్ని ఏం అడిగిండు. హరీశ్ కు ఏదో పదవి అవసరం లేదు. ఇప్పటికే ఆయన మంత్రిగా ఉన్నడు. ఇక్కడ తిరుగుతూ, మీ బాధలు చూసి హరీశ్ గుండెలవిసిపోయాయి. ఖేడ్ అభివృద్ధి కోసం నా కాళ్లు మొక్కుతా అంటున్నడు. ఆయన నా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేదు. హరీశ్ చెప్పినట్లు విని భూపాల్ రెడ్డిని గెలిపించండి. ఖేడ్ ను అభివృద్ధి చేస్తామన్న హరీశ్ మాటను వందకు వంద శాతం నేను నెరవేరుస్తా. గతంలో కాంగ్రెస్ ఏం చేసిందో చూశారు. ఈ నాలుగు నెలల నుంచి హరీశ్ ఏం చేస్తున్నడో చూస్తున్నరు. ఖేడ్ ను వంద శాతం సిద్దిపేటలాగా అభివృద్ధి చేస్తానని హరీశ్ అంటున్నడు. ఆయనకు ఆ శక్తి ఉంది. ఆయన మంచి శక్తి ఉన్నోడు. యువకుడు. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు పోగొడితేనే మంత్రి హరీశ్ కు వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది. అందోలు నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా 20 ఏళ్ల క్రితం అప్పట్లో రవాణా శాఖ మంత్రిగా నేను ఏం చెప్పానో, ఇప్పుడు హరీశ్ కూడా అదే చెబుతున్నారు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.