: అజ్ఞాతంలో మసూద్... ఆఫ్ఘాన్ లో దాగి ఉండొచ్చంటున్న పాక్
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడికి సూత్రధారిగా వ్యవహరించిన జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ పాకిస్థాన్ లో లేడట. పఠాన్ కోట్ దాడి జరిగిన మరుక్షణమే అతడు పాక్ నుంచి అదృశ్యమయ్యాడని, అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే అతడు అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటాడని పాక్ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు జాతీయ న్యూస్ ఛానెల్ ‘ఎన్డీటీవీ’ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. పాక్ అధికారులను సంప్రదించగా, ఈ సమాచారం వెల్లడైందని కూడా ఆ ఛానెల్ పేర్కొంది. గత నెల 2న పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై మెరుపు దాడికి దిగిన ఆరుగురు ఉగ్రవాదులు ఏడుగురు జవాన్లను బలి తీసుకోవడమే కాక దాదాపు 80 గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు. దీనిపై కొన్ని ప్రాథమిక ఆధారాలు సేకరించిన భారత్... దాడికి పథక రచన మొత్తం పాక్ భూభాగంపైనే జరిగిందని, మసూదే దీనికి కీలక సూత్రధారిగా వ్యవహరించాడని పాకిస్థాన్ కు తేల్చిచెప్పింది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడారు. పఠాన్ కోట్ దాడికి సంబంధించిన సూత్రధారులు తమ భూభాగంలో ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే పలు కీలక శాఖలకు చెందిన అధికారులతో అత్యున్నత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం బహవాల్పూర్ లోని మసూద్ నివాసంతో పాటు జైషే కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు జరిపింది. ఈ దాడుల్లో పలువురు జైషే మొహ్మద్ సభ్యులు దొరికినా, మసూద్ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. బహుశా అతడు కుటుంబ సభ్యులతో కలిసి పాక్ నుంచి పారిపోయి ఉంటాడని తాజాగా కొత్త వాదన బయటకు వచ్చింది. ఆఫ్ఘానిస్థాన్ లో అతడు తలదాచుకుని ఉండవచ్చని పాక్ అధికారులను ఉటంకిస్తూ ‘ఎన్డీటీవీ’ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.