: తెలంగాణలో టీడీపీ ఇక బతికే అవకాశం లేదు!: ఎర్రబెల్లి
తెలంగాణలో టీడీపీ ఇక బతికే అవకాశం లేదని ఎర్రబెల్లి దయాకరరావు అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత కారణాల వల్లే తాను పార్టీ మారుతున్నానని అన్నారు. తాను చంద్రబాబునాయుడుకు ఏమాత్రం వ్యతిరేకం కాదని అన్నారు. ఆయన అంటే తనకు గౌరవమని చెప్పారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి కూడా ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానని, అందుకే పార్టీ మారుతున్నానని ఆయన చెప్పారు. తనకు పదవి ఇస్తానని కేసీఆర్ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. గడ్డు పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ పార్టీలో కొనసాగే కంటే పార్టీ మారడమే మేలని ఆయన చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో టీడీపీ నుంచి ఇంకొంతమంది ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరుతారని ఆయన అన్నారు.