: గోదావరి నీళ్లు తెచ్చి మెదక్ జిల్లా ప్రజల కాళ్లు కడుగుతా: కేసీఆర్
మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉపఎన్నిక ప్రచారం నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. ఖేడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ, అన్ని రకాలుగా ఈ జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడి తండాలన్నిటినీ గ్రామ పంచాయతీలుగా మారుస్తామన్నారు. గోదావరి నీళ్లు తెచ్చి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతానని హామీ ఇచ్చారు. నారాయణఖేడ్ కు స్వాతంత్య్రం లేదని, గూండాయిజంతో, దాదాగిరితో కొందరు ప్రజల్ని భయపెడుతున్నారని చెప్పారు. అందుకని ఖేడ్ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలు ఏం చేశాయో మీరు చూశారని, ఇప్పుడు తెలివిగా తమ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాక జిల్లాలో బ్రహ్మాండమైన మంత్రి హరీశ్ రావు ఉన్నారని, ఎలాంటి భయం లేదని భరోసా ఇచ్చారు. ఎన్నికల తరువాత ప్రతి మండలంలో తాను తిరుగుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లాగా నారాయణఖేడ్ ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.