: వేలంటైన్స్ డే స్పెషల్...ఆ 'గులాబీ గుత్తి' జస్ట్ రెండు లక్షలు!
గులాబీ గుత్తి (బొకే) రెండు లక్షల రూపాయలా? అని ఆశ్చర్యపోతున్నారా? ఆ గులాబీల ప్రత్యేకతే అంత మరి! అందుకే వాటి ధర చుక్కలనంటుతోంది. వేలంటైన్స్ డే దగ్గర పడుతుండడంతో ప్రియురాళ్లను ఆనందంలో ముంచెత్తేందుకు ప్రేమికులంతా వివిధ ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గులాబీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇందులో ఈక్వెడార్ లో పుష్పించే గులాబీలకు చాలా డిమాండ్ ఉంది. సముద్రమట్టానికి 2800 మీటర్ల ఎత్తున ఉన్న మచాచీ పట్టణంలో ఈ గులాబీ మొక్కలు పెరుగుతాయి. ఎత్తైన ప్రదేశంలో పెరగడం వల్ల ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి. వీటి కాండం ఐదు అడుగుల ఎత్తు ఎదుగుతుంది. పువ్వు కూడా సాధారణ గులాబీతో పోలిస్తే చాలా పెద్దదిగా ఉంటుంది. అందుకే ఈ రకమైన 150 గులాబీలతో తయారైన బొకే ఖరీదు రెండు లక్షల రూపాయలు. తక్కువ ధరలో కూడా ఇవి లభ్యమవుతాయి. అంటే, 24 పూలు కలిగిన గుత్తి ఖరీదు కేవలం 50,000 రూపాయలు అని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఈ గులాబీలను ఎరీనా ఫ్లవర్స్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది.