: రాయలసీమ ఫ్యాక్షనిజానికి...విజయవాడ రౌడీయిజానికి తేడా ఇది: రాంగోపాల్ వర్మ
రాయలసీమ ఫ్యాక్షనిజానికి, విజయవాడ రౌడీయిజానికి చాలా తేడా ఉందని తాను విడుదల చేసిన ఆడియో ప్రకటనలో రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. 'వంగవీటి' సినిమా తెలుగులో తన చివరి సినిమా అని తెలిపిన సందర్భంగా విడుదల చేసిన ఆడియో ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఫ్యాక్షనిస్టులు పగతీర్చుకోవడమే లక్ష్యంగా జీవిస్తారని అన్నారు. అందుకే ఫ్యాక్షనిస్టులు పదేపదే ప్రత్యర్థులను అంతమొందించేందుకు ప్రయత్నిస్తారని ఆయన పేర్కొన్నారు. అదే రౌడీలైతే డబ్బు సంపాదన కోసం, తమను తాము రక్షించుకునేందుకు హత్యలు చేస్తారని వర్మ అభిప్రాయపడ్డారు. తన 'వంగవీటి' సినిమాలో రౌడీ రాజకీయాలను చూపిస్తానని వర్మ ప్రకటించారు. విజయవాడలో పలు సంఘటనలకు సాక్షిగా ఉన్న తాను ఈ సినిమా చేస్తానని చెప్పగానే, దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాను కథానుసారం తీయమని, ఎక్కడా రాజీపడవద్దని తనకు దన్నుగా నిలిచారని, 'వంగవీటి' సినిమాను అద్భుతంగా తెరకెక్కించేందుకు తమ యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోందని వర్మ తెలిపారు. తనకు తెలుగులో ఇంత కంటే గొప్ప కథ దొరికే అవకాశం లేదని, అందుకే దీని తర్వాత తెలుగు సినిమాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నానని ప్రకటించారు.