: లోకేశ్ పిఏ నంటూ తిరుపతి ఎమ్మెల్యేను బురిడి కొట్టించే ప్రయత్నం!


రాజకీయనేతలు, సినీ నటుల పేర్లు చెప్పుకుని డబ్బులు వసూలుచేయడం, బెదిరింపులకు దిగడం...వంటి ఘటనలు వింటూనే ఉన్నాం. ఇటీవల సినీ హీరో నారా రోహిత్ పేరుతో ఓ వ్యక్తి డబ్బు వసూలు చేశాడంటూ కొంతమంది ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నారా లోకేశ్ పిఏ నంటూ ఓ వ్యక్తి తిరుపతి మహిళా ఎమ్మెల్యే సుగుణమ్మను బురిడీ కొట్టించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. వివరాల్లోకి వెళితే... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిఏ విజయ్ నంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎమ్మెల్యే సుగుణమ్మకు ఫోన్ చేశాడు. తనకు చెంది వ్యక్తులు వస్తారని, వారికి రూ.కోటి ఇచ్చి పంపాలని ఎమ్మెల్యేతో చెప్పాడు. ఆమెకు నమ్మకం కుదిరేందుకు సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేరు కూడా చెప్పాడట. అయినా అనుమానంతో ఎమ్మెల్యే, ఆమె అల్లుడు సంజయ్ లు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయానికి ఫోన్ చేసి విషయమంతా చెప్పారు. అసలా పేరున్న వ్యక్తే లేడని ఇక్కడి వారు తెలిపారు. దాంతో వెంటనే తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టీకి ఫోన్ చేసి చెప్పారు. ఈలోగా మళ్లీ పిఏ అని చెప్పుకున్న వ్యక్తి ఫోన్ చేయడంతో డబ్బులు ఇస్తామని చెప్పి ఇంటికి రమ్మన్నారు. మరోవైపు పోలీసులు ఎమ్మెల్యే ఇంటివద్ద మాటువేసి ఉన్నారు. కొంతసేపటికి శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తి, మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు సుగుణమ్మ ఇంటికి వచ్చారు. డబ్బు వాళ్లకు ఇస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కారు స్వాధీనం చేసుకుని, వారిని అర్బన్ ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News