: 35 శాతం ఎక్సెస్ కు కోట్ చేసిన సంస్థలతో చర్చలట... తాత్కాలిక రాజధాని టెండర్లపై ఏపీ సర్కారు నిర్ణయం


టెండర్ల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన తాత్కాలిక సచివాలయం కోసం సర్కారు విడుదల చేసిన ప్రకటనకు రెండంటే రెండు సంస్థలే స్పందించాయి. నిర్మాణ రంగంలో విశేష అనుభవం గడించిన ఎల్ అండ్ టీతో పాటు షాపూర్జీ పల్లోంజీలు బిడ్లను దాఖలు చేశాయి. బిడ్లను తెరచిన సీఆర్డీఏ అధికారులు నోరెళ్లబెట్టారు. సర్కారు ప్రతిపాదించిన ధర కంటే ఏకంగా 35 శాతం అధిక ధరలను కోట్ చేస్తూ ఆ రెండు సంస్థలు బిడ్లను దాఖలు చేశాయి. సాధారణంగా ప్రతిపాదిత ధర కంటే 5 శాతం ఎక్సెస్ కు కోట్ చేస్తేనే ఆ టెండర్లను అనుమతిస్తారు. లేదంటే తిరస్కరణ తప్పనిసరి. అతి పెద్ద పనికి రెండు సంస్థలే ముందుకు రావడం, అంతేకాక రెండు సంస్థలు ఒకే రీతిలో 35 శాతం అధిక ధరలను కోట్ చేస్తూ టెండర్లు దాఖలు చేయడంతో ఏం చేయాలో పాలుపోక సీఆర్డీఏ అధికారులు తలలు పట్టుకున్నారు. నిబంధనల మేరకు టెండర్లను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఈలోగా ఏం జరిగిందో తెలియదు కాని, అధిక ధరలకు బిడ్లను దాఖలు చేసిన ఆ రెండు సంస్థలతో బేటీ కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో చర్చల కోసం ఆ రెండు సంస్థల ప్రతినిధులకు సీఆర్డీఏ అధికారులు ఆహ్వానం పంపారు. మరికాసేపట్లో ఆ సంస్థల ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారుల మధ్య విజయవాడలో చర్చలు ప్రారంభం కానున్నాయి. వాస్తవ పరిస్థితులను వివరించి బిడ్లలో పేర్కొన్న ధరలకు కాకుండా ప్రతిపాదిత ధరలకు కాస్తంత ఎక్కువగా పనులు చేయాలని అధికారులు ఆ సంస్థలకు ప్రతిపాదించనున్నారని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కొద్దిసేపటి క్రితం చెప్పారు. తమ ప్రతిపాదనలకు ఆ సంస్థలు సరేనంటే సరే, లేదంటే కొత్తగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే, 35 శాతానికి కాదు గాని... 24 శాతం ఎక్కువ ధరలకు పనిచేస్తామంటే చెప్పండంటూ ఆ రెండు సంస్థకు సీఆర్డీఏ బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. నిబంధనల మేరకు ప్రతిపాదిత ధరల కంటే 5 శాతం ఎక్సెస్ కే అనుమతులివ్వాల్సి ఉండగా, 24 శాతం అధిక ధరలకు పనులు అప్పగించేందుకు సాక్షాత్తు సర్కారే ప్రతిపాదించనుండటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News