: అండర్ 19 జట్టు విజయాల వెనుక ఉన్నది ఆ ఒక్కడే!
టీమిండియా అండర్ 19 జట్టు గురించి అంతర్జాతీయ జట్లన్నీ చర్చించుకుంటున్నాయి. గత కొంత కాలంగా అండర్ 19 భారత జట్టు అద్వితీయ శక్తిగా ఎదిగింది. ఈ జట్టులో ఆటగాళ్లంతా సమష్టిగా రాణించడం వెనుక ఉన్న శక్తి ఏంటని అంతా ఆరా తీస్తున్నారు. టీమిండియా మాజీ ఆటగాళ్లలో అంత్యత ప్రతిభావంతుడైన ఆటగాడిగా, టీమిండియా వాల్ గా, మిస్టర్ డిపెండబుల్ గా, మిస్టర్ పర్ ఫెక్ట్ గా, జామీ వంటి ఎన్నో పేర్లతో పిలిపించుకున్న రాహుల్ ద్రవిడ్ అండర్ 19 జట్టు వెనుక ఉన్నాడు. భవిష్యత్ భారత జట్టు అభేద్యమైనదిగా ఉండాలని భావించిన రాహుల్ ద్రవిడ్ జాతీయ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు సానబెడుతున్నాడు. కేవలం ప్రతిభతో ఎంపికయ్యే ఆటగాళ్ల లోపాల్ని సరిదిద్ది, సాంకేతికంగా గొప్పగా తయారు చేస్తున్నాడు. ఓ వైపు ఆటలో నైపుణ్యం, ఫిట్ నెస్ సామర్థ్యం, మెరుపు వేగం వంటివాటిల్లో అలుపెరుగని సాధన చేయిస్తున్నాడు. ఆటగాడిలో ఏమాత్రం లోపం కనిపించినా దానిని సరిదిద్దే వరకు విశ్రమించడం లేదు. టీమిండియా యువ ఆటగాళ్లకు ద్రవిడ్ గైడ్, మంచి స్నేహితుడు, గురువు. ద్రవిడ్ దిశానిర్దేశంలో యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ, ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నారు. దీంతో అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లోకి టీమిండియా సగర్వంగా చేరింది. మరొక్క మ్యాచ్ విజయవంతంగా పూర్తి చేస్తే, వరల్డ్ కప్ ను గురుదక్షిణగా ద్రవిడ్ కు అందజేయనుంది. సాంకేతికంగా ఎంతో ఉన్నతమైన నైపుణ్యం కలిగిన ద్రవిడ్ కోచింగ్ లో యువ ఆటగాళ్లు రాటుదేలడం భవిష్యత్ అవసరాలకు ఎంతో లాభదాయకమని సెలెక్టర్లు సంబరపడిపోతున్నారు.