: తలపాగా తీయలేదని ఆ సిక్కు నటుడిని విమానం ఎక్కనీయలేదు!


తలపాగా తీయకపోతే విమాన ప్రయాణానికి అంగీకరించమంటూ ఒక సిక్కు నటుడిని ఎయిర్ మెక్సికో సిబ్బంది ఇబ్బంది పెట్టారు. యూఎస్ కు చెందిన సిక్కు నటుడు వారిస్ అహ్లువాలియా నిన్న సాయంత్రం మెక్సికో సిటీ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి న్యూయార్క్ వెళ్లే విమానం ఎక్కేందుకు వెళ్లాడు. సుమారు 5.30 గంటల ప్రాంతంలో ఎయిర్ మెక్సికో కౌంటర్ వద్ద అతన్ని చెక్ చేశారు. ఆ తర్వాత ఫస్ట్ క్లాసు బోర్డింగ్ పాసు ఇచ్చారు. దీంతో పాటు వారిస్ అహ్లువాలియాకు సెకండరీ సెక్యూరిటీ స్క్రీనింగ్ నిర్వహించాలని తెలిపే ఒక కోడ్ కూడా అతని చేతికి సిబ్బంది ఇచ్చారు. మెక్సికో జాతీయ జెండాలు పట్టుకుని ఉన్న విమానయాన సిబ్బంది అతనిని న్యూయార్క్ వెళ్లే ఫ్లైట్ 408 గేట్ వద్ద వేచిఉండమని చెప్పారు. ఇతర ప్రయాణికులు వెళ్లిన తర్వాత తనని లోపలికి పంపిస్తామని అహ్లువాలియాకు చెప్పారు. రెండోసారి చేసిన సెక్యూరిటీ చెక్ లో, ఆపాదమస్తకం ఆయన్ని తడిమి చూడటంతో పాటు లగేజ్ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత అహ్లువాలియా ధరించిన స్వెట్టర్ ను తీసివేయమన్నారు. అంతటితో ఆగని విమాన సిబ్బంది అతను ధరించిన తలపాగాను కూడా తొలగించాలని కోరారు. అది తమ మతవిశ్వాసాలకు సంబంధించిన అంశమని.. దానిని తొలగించనని చెప్పాడు. కొద్దిసేపు వారిలో వారు చర్చించుకున్న సంస్థ సిబ్బంది..‘ఓకే. వీురు విమానమెక్కడానికి వీలులేదు’ అని అతనికి చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ఇచ్చింది. తలపాగా తీయకపోతే కనుక ఎయిర్ మెక్సికోకు చెందిన ఏ విమానంలోనూ తనను అనుమతించమని సదరు సిబ్బంది అన్నట్లు అహ్లువాలియా చెప్పినట్లు ఆ పత్రికలో పేర్కొంది. ఈ సంఘటన అనంతరం సదరు ఎయిర్ లైన్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. కేవలం భద్రతా కారణాల రీత్యానే తాము టర్బన్ తొలగించాము తప్పా, వేరే ఉద్దేశం ఏమీ లేదని పేర్కొంది. కాగా, నలభై ఒక్క సంవత్సరాల అహ్లువాలియా నటుడు మాత్రమే కాదు డిజైనర్ కూడా. మాన్ హట్టన్ లో ఆభరణాల వ్యాపారం నిర్వహిస్తుంటాడు.

  • Loading...

More Telugu News