: తెలంగాణలోలానే ఏపీలో కూడా సమగ్ర సర్వే నిర్వహించాలి: ఆర్.కృష్ణయ్య
బీసీ జాబితాలో ఏదైనా కులాన్ని కలపాలంటే ముందుగా జనాభాను పరిగణలోకి తీసుకోవాలని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఇందుకోసం కాపుల జనాభా లెక్కలు తీయాలని సీఎం చంద్రబాబును తాను అడిగినట్టు చెప్పారు. జనాభా లెక్కలపై తెలంగాణలో సమగ్ర సర్వే నిర్వహించారని, ఏపీలోనూ అదేవిధంగా సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. విజయవాడ ఐలాపురం హోటల్ లో నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ సదస్సులో పాల్గొన్న కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. అంతేగాక కాపులను బీసీల్లో కలపడం సమంజసమా? అనేది కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు నష్టం లేకుండా చేస్తామంటున్నారని, అదెలా సాధ్యమో కూడా తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.