: వైద్యుల మధ్య వ్యాపార లావాదేవీలే కాల్పులకు కారణం!
హైదరాబాదులోని హిమయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 6లో జరిగిన కాల్పుల వెనుక అసలు కథను పోలీసులు తెలుసుకున్నారు. వీరు తెలిపిన వివరాల ప్రకారం, మాదాపూర్ లోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఉదయ్ కుమార్, శశికుమార్, సాయికుమార్ అనే ముగ్గురు వైద్యులు పెట్టుబడి పెట్టారు. ఇందులో ఉదయ్ 3.5 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టగా, శశికుమార్ 75 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఆసుపత్రి ప్రారంభమై చాలా కాలం గడుస్తున్నప్పటికీ లాభాలు రావడం లేదని ఉదయ్ కుమార్ చెబుతున్నారు. దీంతో విసిగిపోయిన శశికుమార్, ఉదయ్ కుమార్ తో ఘర్షణ పడ్డారు. ఈ నేపధ్యంలో ఆగ్రహానికి లోనైన శశికుమార్ లైసెన్స్ తుపాకీతో ఉదయ్ పై కాల్పులు జరిపారు. కాగా, తుపాకి గుండు అతని తల పక్కనుంచి వెళ్లడంతో ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న శశికుమార్ ను పట్టుకునేందుకు రెండు టీంలను ఏర్పాటు చేశామని వారు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, పూర్తి వివరాలు శశికుమార్ దొరికిన తరువాత వెల్లడించగలమని వారు స్పష్టం చేశారు.