: తొలి విడతలో హైదరాబాద్, వరంగల్ జర్నలిస్టులకు ఇళ్లు: సీఎం కేసీఆర్
తొలి విడతలో హైదరాబాద్, వరంగల్ జర్నలిస్టులకు ఇళ్లు కేటాయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్ట్ టైమ్ రిపోర్టర్లందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంలో గృహాలు కేటాయిస్తామని చెప్పారు. జర్నలిస్టుల గృహ సముదాయం కోసం రాజేంద్రనగర్ బుద్వేల్ లో ని వంద ఎకరాల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తామన్నారు. దిగువ మధ్యతరగతికి చెందిన జర్నలిస్టులకు సొంత ఇళ్లు లేవని, అన్ని విభాగాలకు చెందిన జర్నలిస్టులకు ఇళ్లు కేటాయిస్తామని, వారంతా మెరుగైన జీవితం గడపాలన్నదే తమ లక్ష్యమని సీఎం అన్నారు. జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాన్ని సమన్వయం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు, స్థలాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ప్రభుత్వానికి బదిలీ చేయాలని సంబంధిత మంత్రిని ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులకు ఇళ్ల విషయమై మంత్రులు, కలెక్టర్లకు సూచనలిస్తామని కేసీఆర్ తెలిపారు. కాగా, తెలంగాణలోని ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం తరపున ఇల్లు కేటాయిస్తామని కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కన్నా మరింత విశాలంగా ఉండేలా వీటిని నిర్మించాలని సూచించారు. కొత్తగా నిర్మించనున్న ఈ జర్నలిస్టు కాలనీ దేశంలోనే నెంబర్ వన్ గా ఉండేలా తీర్చిదిద్దుతామని కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే.