: అన్నా డీఎంకేకు పోటెత్తిన అభిమానం!...పార్టీ టికెట్ల కోసం 26 వేల దరఖాస్తులు, రూ.28.40 కోట్ల రాబడి


తమిళనాట అలనాటి నట దిగ్గజం ఎంజీ రామచంద్రన్ ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే)కి నేటికీ అభిమానం వెల్లువెత్తుతోంది. ఎంజీఆర్ మరణానంతరం ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీకి ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నా ఆమే ఆ పార్టీకి అధినేత్రి. పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పీఠం ఎక్కేది కూడా ఆమెనే. ప్రధాని పీఠం అధిష్టించే సత్తా ఉన్న నేతగానూ ఆమెకు పలు సర్వేలు నీరాజనం పలికాయి. తాజాగా ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం పదవీ కాలం మూడు నెలల్లో ముగిసిపోనుంది. ఈ ఏడాదే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే ప్రచారానికి జయలలిత తెర తీశారు. ఇంకేముంది, పార్టీ టికెట్ల కోసం తమిళనాడుతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన నేతల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. నిన్నటితో దరఖాస్తులకు గడువు ముగిసింది. గడువులోగా మొత్తం 26,174 దరఖాస్తులు వచ్చినట్లు ఆ పార్టీ నిన్న అధికారికంగా ప్రకటించింది. పార్టీ దరఖాస్తుల విక్రయం ద్వారా పార్టీ ఖజానాకు ఏకంగా రూ.28.40 కోట్లు సమకూరినట్లు కూడా ఆ పార్టీ ప్రకటించింది. వచ్చిన దరఖాస్తుల్లో తమిళనాడు నుంచే 17,698 ఉన్నాయి. ఇక పుదుచ్ఛేరి నుంచి 332, కేరళ నుంచి 208 దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉంటే, మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా ఆ పార్టీ ప్రకటించింది. ఏకంగా 7,936 మంది పార్టీ నేతలు తమ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జయలలితను కోరారట.

  • Loading...

More Telugu News