: అగ్రిగోల్డ్ కేసును సీబీఐకి బదిలీ చేయండి!... ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశం


లక్షలాది మధ్యతరగతి కుటుంబాలను నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కొద్దిసేపటి క్రితం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన డిపాజిటర్లకు చెందిన ఈ కేసులో ఏపీ సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిపాజిటర్ల సొమ్ముతో అగ్రిగోల్డ్ కొనుగోలు చేసిన ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని తాము భావిస్తుంటే... ఆస్తుల వేలానికి గాని, విక్రయానికి గాని అగ్రిగోల్డ్ సంసిద్ధత వ్యక్తం చేయడం లేదని హైకోర్టు ఆక్షేపించింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం తీరుపై మెతక వైఖరి అవలంబిస్తున్న సీఐడీ అధికారులు దర్యాప్తును నత్తనడక సాగిస్తున్నారని కూడా కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో డిపాజిటర్ల సంక్షేమం దృష్ట్యా కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News