: డ్యూటీలో ఉండే మహిళా పోలీసుల ఇబ్బందులివి... సర్వేలో వెలుగుచూసిన నిజాలు


మహిళా సాధికారతలో భాగంగా మరింత మంది మహిళలను పోలీసు, సైన్యం, వైమానిక, నౌకా దళాలు, భద్రతా విభాగాల్లో చొప్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్న వేళ, డ్యూటీ సమయాల్లో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఓ సంస్థ సర్వే నిర్వహించగా పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా పోలీసులు తమ డ్యూటీ సమయాల్లో ఎంతో అసౌకర్యంగా ఉంటున్నారట. ముఖ్యంగా సమీపంలో అందుబాటులో ఉండని టాయ్ లెట్లు వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. గుర్ గాంలోని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో 'ఉమన్ ఇన్ పోలీస్' అంశంపై 7వ జాతీయ సదస్సు జరుగగా, ఈ సర్వే వివరాలు విడుదలయ్యాయి. తమకు ఇచ్చే బులెట్ ప్రూఫ్, బాడీ ప్రొటెక్షన్ పరికరాలు చాలా బిగుతుగా ఉండి అసౌకర్యంగా ఉంటున్నాయని, కొన్నిసార్లు శ్వాస పీల్చుకోవడానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పురుషుల శరీరాలకు తగ్గట్టుగా తయారైన వాటినే తమకూ ఇస్తున్నారని సర్వేలో పాల్గొన్న పలువురు మహిళా పోలీసులు వాపోయారు. నెలసరి సమయాల్లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. ఈ విషయంలో కానిస్టేబుల్ హోదా నుంచి డీజీపీ స్థాయిలోని వారి వరకూ ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడించడం గమనార్హం. కానిస్టేబుల్ నియామకాల్లో 33 శాతం, సరిహద్దు భద్రతా దళంలో 15 శాతం వరకూ మహిళలను నియమించాలని హోం శాఖ నిర్ణయించిన వేళ, తొలుత ఈ సమస్యలను పరిష్కరించాలని మహిళా పోలీసులు కోరుతున్నారు. మహిళలకు మరింత ప్రైవసీ కల్పించాలని సర్వేను నిర్వహించిన ఐపీఎస్ అధికారిణి రేణుకా మిశ్రా కోరారు. ఇందులో భాగంగా సీఆర్పీఎఫ్, సహస్త్ర సీమా బల్, హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలకు చెందిన 334 మందిని ప్రశ్నించామని తెలిపారు.

  • Loading...

More Telugu News