: బాపిరాజు గారి ఇంటిలో దొంగలు పడ్డారు... కారు, రూ.6 లక్షల బంగారు నగలు దోచేశారు!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఇంటిలో దొంగలు పడ్డారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెం:12 లో బాపిరాజు నివాసముంటున్నారు. శనివారం చడీ చప్పుడు లేకుండా ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన దొంగలు... బాపిరాజు కుటుంబ సభ్యులు ఇంటిలో ఉండగానే ఫస్ట్ ఫ్లోర్ లోని బెడ్ రూంలోకి బొరబడ్డారు. గదిలోని బీరువాను తెరచిన దొంగలు అందులోని దాదాపు రూ.6 లక్షల విలువ చేసే నగలను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లే క్రమంలో ఇంటి ముందు పార్క్ చేసిన ఇన్నోవా కారు (ఏపీ 09 బీఏ 0456)ను సైతం తీసుకుపోయారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లాల్సిన బాపిరాజు కుటుంబ సభ్యులు కిందకు రాగా, కారు కనిపించలేదు. అయితే అర్జెంట్ గా వెళ్లాల్సి ఉండటంతో ఇంకో కారులో వారు ఎయిర్ పోర్టుకు వెళ్లారు. ఎయిర్ పోర్టు నుంచి తిరిగి వచ్చి చూడగా, చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. చోరీని నిర్ధారించుకున్న బాపిరాజు కోడలు చైతన్య నిన్న బంజారాహిల్స్ పోలీసులకు పిర్యాదు చేశారు.