: ముంబై దాడుల పథక రచన లష్కరేది... సహకారం ఐఎస్ఐది: ఒప్పేసుకున్న హెడ్లీ
2008లో భారత వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన మారణ హోమానికి పూర్తి స్థాయిలో పాకిస్థాన్ మద్దతిచ్చిందన్న విషయం మరోమారు రూఢీ అయ్యింది. ఈ మేరకు ఈ దాడుల్లో కీలకంగా వ్యవహరించిన అమెరికాకు చెందిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ విచారణలో అసలు విషయాలను ఒప్పేసుకున్నాడు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు జరిపిన విచారణలో భాగంగా హెడ్లీ పలు కీలక విషయాలను వెల్లడించాడు. లష్కరే తోయిబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ ఈ దాడులకు పథక రచన చేయగా, అతడికి పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సహకరించిందని హెడ్లీ తెలిపాడు. తనను ఐఎస్ఐ కి చెందిన మేజర్ ఇక్బాల్, సమీర్ అలీలు నియంత్రించగా, లఖ్వీ ప్రతినిధిగా ఐఎస్ఐకి చెందిన బ్రిగేడియర్ రివాజ్ వ్యవహరించాడని అతడు చెప్పాడు. దాడులకు ముందు ఐఎస్ఐ చీఫ్ సుజా పాషా లష్కరే తోయిబా కమాండర్ లఖ్వీని నేరుగా కలిశాడని కూడా హెడ్లీ పేర్కొన్నాడు. ఇక ఢిల్లీలోని భారత ఉప రాష్ట్రపతి నివాసం, ఇండియా గేట్, సీబీఐ కార్యాలయాలపైనా రెక్కీ నిర్వహించినట్లు తెలిపాడు. ఈ రెక్కీ కోసం తనకు ఐఎస్ఐ డబ్బు ముట్టజెప్పిందని కూడా అతడు చెప్పాడు. ముంబై దాడుల కేసులో దోషిగా తేలిన హెడ్లీకి అమెరికా కోర్టు 35 ఏళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ముంబై కోర్టులో నేటి నుంచి ప్రారంభం కానున్న విచారణలో హెడ్లీ ఈ విషయాలన్నిటినీ అధికారికంగా ఒప్పుకోనున్నాడు.