: పి.గన్నవరంలో ఉద్రిక్తత.. చినరాజప్ప, టీడీపీ ఫ్లెక్సీల చించివేత, పీఎస్ ను ముట్టడించిన కాపులు
కాపులకు రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉభయగోదావరి జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ముద్రగడ స్వీయ నిర్బంధం విధించుకోవడంతో కాస్తంత వెనక్కు తగ్గిన ప్రభుత్వం కిర్లంపూడిలోని ఆయన ఇంటి వద్ద మోహరించిన బలగాల్లో సగం మంది పోలీసులను ఉపసంహరించింది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్వీయ గృహ నిర్బంధం విధించుకున్న ముద్రగడకు ఏదైనా జరుగుతుందేమోనన్న భయంతో కాపులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ముద్రగడపై ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చినరాజప్ప సహా టీడీపీ ఫ్లెక్సీలను వారు దహనం చేశారు. ఆ తర్వాత కాపు మహిళలంతా పెద్ద సంఖ్యలో ఒక్కదరికి చేరి పి.గన్నవరం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.