: ముద్రగడ దీక్ష భగ్నానికి మంత్రుల తమదైన శైలి యత్నాలు... కాపులకు సెల్ ఫోన్ సందేశాలు


కాపులకు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీసమేతంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన సొంతింటిలో ఆయన చేపట్టిన దీక్ష నేటికి మూడో రోజుకు చేరుకుంది. ముద్రగడ దీక్షను విరమింపజేసేందుకు ఆదిలోనే యత్నించిన ప్రభుత్వం ఆశించిన మేర ఫలితం సాధించలేకపోయింది. తాజాగా ముద్రగడ దీక్షను విరమింపజేసేందుకు నిర్మాణాత్మక చర్యలను పక్కనబెట్టేసిన ప్రభుత్వం, దొడ్డిదారి యత్నాలను ఆశ్రయించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఏపీ కేబినెట్ లోని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, కీలక మంత్రి గంటా శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు పేరిట కాపులకు సెల్ ఫోన్ మెసేజ్ లు పోటెత్తుతున్నాయి. ‘‘కాపు సోదరులారా ఆలోచించండి. ఆందోళన చెందవద్దు. మీ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అంటూ కాపుల సెల్ ఫోన్లలో ప్రత్యక్షమవుతున్న సందేశాలు ప్రస్తుతం పెద్ద చర్చకే తెర లేపాయి. కాపులకు రిజర్వేషన్లతో పాటు వచ్చే ఏడాది కాపు కార్పొరేషన్ కు రూ.1,000 కోట్ల నిధులు విడుదల చేయనున్నామని సదరు సందేశాల్లో ఆ ముగ్గురు నేతలు కాపులకు నచ్చజెబుతున్నారు. ఇక రాష్ట్రం ఆర్థిక చిక్కుల్లో ఉన్నా, కాపుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని వారు మెసేజ్ లు పంపుతున్నారు. మరి ఏపీ మంత్రుల ఈ మెసేజ్ ల మంత్రం ఫలిస్తుందో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News