: చంద్రబాబుపై ముద్రగడ ఘాటు వ్యాఖ్యలు... 2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్
కాపులకు రిజర్వేషన్లే ప్రధాన లక్ష్యంగా సతీసమేతంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్వరం మరింత పెంచారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకుని ఆయన కొద్దిసేపటి క్రితం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం 2 ఎకరాల పొలం ఉన్న చంద్రబాబు, అనతి కాలంలోనే రూ.2 లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ కిటుకేదో చెబితే, తాము కూడా రిజర్వేషన్లను డిమాండ్ చేయమని కూడా ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చెప్పే కిటుకుతో తాము కూడా అనతి కాలంలోనే ఆర్థికంగా స్థితిమంతులమవుతామని ప్రకటించిన ముద్రగడ, సమాజంలో ఇక ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా రిజర్వేషన్లు అవసరం ఉండదని చెప్పారు. చంద్రబాబు మొండి అయితే, తాను జగమొండినని ముద్రగడ వ్యాఖ్యానించారు. నిర్దేశించుకున్న లక్ష్యం చేరే దాకా దీక్ష విరమించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ముద్రగడ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.