: తుమ్మల మంత్రాంగమే... గ్రేటర్ లో టీఆర్ఎస్ కు ఘన విజయాన్ని సాధించి పెట్టింది!


గడచిన సార్వత్రిక ఎన్నికల దాకా టీడీపీలో ఉన్న సీనియర్ రాజకీయ నేత తుమ్మల నాగేశ్వరరావు స్వస్థలం ఖమ్మం జిల్లా. అయితే ఆయనకు హైదరాబాదులో మంచి పట్టుందన్న విషయం జగమెరిగిన సత్యమే. హైదరాబాదీల్లో ముఖ్యంగా సెటిలర్లుగా భావిస్తున్న వారిలో ఆయనకు మంచి పేరుంది. తుమ్మల ఏం చెప్పినా సెటిలర్లు ఓకే అనేస్తారు. తెలుగు చిత్రసీమలో ఉన్నత శిఖరాలకు చేరుకుని ఆ తర్వాత రాజకీయ తెరంగేట్రం చేసిన దివంగత నందమూరి తారకరామారావు... తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట స్థాపించిన తెలుగు దేశం పార్టీ(టీడీపీ)లో తుమ్మల తొలి తరం నేత. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాను టీడీపీ ఖిల్లాగా మార్చడంలో ఆయనదే కీలక భూమిక. ఎన్టీఆర్ కేబినెట్లోనే కాక చంద్రబాబు మంత్రివర్గంలోనూ తుమ్మలకు అత్యంత ప్రాధాన్యం ఉండేది. రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తుమ్మల తొలిసారి పరాజయం చవిచూశారు. ఆ తర్వాత కేసీఆర్ పిలుపు మేరకు తుమ్మల సైకిల్ దిగేసి కారెక్కారు. పచ్చ కండువా తీసేసి, గులాబీ కండువా కప్పుకున్నారు. అటు అసెంబ్లీలో కానీ, ఇటు శాసన మండలిలో కానీ సభ్యత్వం లేకుండానే కేసీఆర్ కేబినెట్ లో ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా... సెటిలర్లలో తుమ్మలకు ఉన్న మంచి పేరును కేసీఆర్ ప్రయోగించారు. ఎన్నికల వ్యూహాల్లో తుమ్మలకు ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్... పార్టీ వ్యూహాల అమలును తుమ్మల భుజస్కందాలపై పెట్టారు. కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని తుమ్మల వమ్ము చేయలేదు. తెర వెనుకే ఉన్నప్పటికీ ఆయన తనదైన శైలిలో మంత్రాంగం నడిపారు. ఈ క్రమంలోనే సెటిలర్లు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ వశమయ్యాయి. అదే సమయంలో టీడీపీకి ఘోర పరాజయం కూడా తుమ్మల మంత్రాంగం ఫలితమేనన్న వాదన కూడా వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News